Powered by Blogger.
RSS

.

.

5. సి.రా.శ్రీ

జడయన మన్మధపాశము 
జడబారిన పడినవాడు సరసుండగునే 
జడమతియైనను మరి యా
జడ తాకగ కలుగునింక జ్ఞానోదయమే

కడు మిక్కిలి మక్కువతో 
జడ చాటున జంగమయ్య జాబిలినుంచెన్
జడ కీరితి ఎంతని మరి? 
జడ నాట్యం చేసె "సత్య" శృంగారంగా

గుడిగంటలు బడిగంటలు 
సడిసేయును చెవులలోన సత్యంబిదియే  
జడగంటలు చిలిపిగ మరి 
సడిసేయును గుండెలందు సందోహమునే 

మూడగు పాయల పారుచు 
మోడగు ఎదలను నిరతము మురిపించు జడే 
పాడగు పోనీటైలుగ
చెడిచచ్చెను నేడునిటుల చింతింపగనే

కృత యుగమున చంద్రమతియు
త్రేతమ్మున జానకమ్మ తీర్చెను జడనే
ఖ్యాతిచ్చెను సాత్రాజితి 
నాతికి సంపద మరి జడ నవయుగ జగమున్
 కలం పేరు సిరాశ్రీ. అసలు పేరు సి. రాం శ్రీకాంత్. చదివింది ఎం.ఏ, ఎం.బీ.ఏ. వృత్తి రచన. ప్రవృత్తి కవిత్వం. అను వృత్తి సినిమా పాటలు వ్రాయడం. ఉపవృత్తి పలు కంపెనీలకు సృజనాత్మక సేవలందించడం. వ్యాపకం పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, పద్యాలు వ్రాయడం, తిరగడం. 16 వ ఏట "శత కిరణాలు" శతక రచన. సినీ సమీక్షకుడిగా చిత్ర రంగానికి పరిచయం. ఇప్పటి వరకు 50 కి పైగా సినీ గీతాలు, 20 కి పైగా భక్తి గీతాల రచన. సినీ దర్శకులు రాం గోపాల్ వర్మతో జరిపిన సంభాషణల ఆధారంగా "వోడ్కా విత్ వర్మ" పుస్తక రచన. 


  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment