Powered by Blogger.
RSS

.

.

18. ఎమ్.ఎస్.రామకృష్ణ

ఉయ్యాలవోలె నూగుచు 
వయ్యారపు నడుముపైన వగలను బోవన్‌
సయ్యాటలాడు వాల్జడ 
అయ్యారే! అతివ నడకకందములద్దున్‌!
 

యమపాశము కీచకులకు 
సుమబాణము రమణుడైన సురుచిర పతికిన్‌
రమణీయము సుందరి జడ 
సమభావము గల్గినట్టి సరసులకెల్లన్‌!
 
 
నడుమును పిరుదులు దాటుచు 
మెడ వెనుకనె జారిజారి మెలికలు తిరుగున్‌
పడగెత్తు నాగు రీతిని 
జడవంపుల తరచి తరచి జగతిని చూడన్‌!
  

అలకల పానుపునెక్కను 
సలలితముగ వలపు జూపి సరసములాడన్‌ 
కలహాన కార్యసిద్ధికి 
పలుఘటనల సూత్రధారి పడతికి జడయే!


మెడమీద పూలనాట్యము 
పొడవగు కేశాల కూర్పు ముప్పేటలతో!
పడతికి నింపొన గూర్చెడి 
జడసొంపును పొగడ తరమె జహ్నువుకైనన్‌!!
 
 
 
M.S.Ramakrishna,
H.No.10-10, SBI Colony, Kothapeta,
(Post) Saroornagar,
Hyderabad-500035.

Mobile: 9849619290

స్వీయపరిచయం: ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, స్వాతి, కారవాన్‌, విమెన్స్‌ ఇరా, శంకర్స్ వీక్లీ, వైజ్‌క్రాక్‌, వగైరా పలు ప్రముఖ పత్రికలలో కార్టూనిస్ట్
రామకృష్ణ గా పాఠకులందరికి చిరపరిచితులైన యమ్మెస్ రామకృష్ణ పూర్తి పేరు మునగపాటి శివరామకృష్ణ. కార్టూన్‌రంగం లో అడుగుపెట్టడానికి స్ఫూర్తి గురుదేవులు బాపు గారయితే, పద్యకవిత్వం మీద మక్కువ పెంచుకోవటానికి కారణం పోతన మహాకవి, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అంటారు రామకృష్ణ. వీరి తండ్రి గారు ప్రముఖ కవి కీ.శే. మునగపాటి విశ్వనాథ శాస్త్రి గారు. నాన్నగారు వారసత్వంగా అందించిన పద్యకవిత్వం, గేయాలు, రచనల ప్రభావంతో, నేటి సమకాలీన సమాజ స్థితిగతులపై తాను వ్రాసిన వ్యంగ్య-హాస్య పద్యాలతో వివిధ కవిసమ్మేళనాల్లో పాల్గొని ప్రముఖ కవుల ప్రశంసలు పొందుతున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి స్వచ్చందంగా పదవీ విరమణ చేసిన రామకృష్ణ, తనకు ఇష్టమైన కార్టూన్లు, కవిత్వం, మల్టీమీడియాలో  కృషి చేస్తున్నారు.  బాపు గారి చిత్రకళావిన్యాసం, పోతన/పాపయ్యశాస్త్రి గారల పద్యకవిత్వం, అలనాటి క్లాసిక్ సినిమాలు/పాటలు తనకెంతో ఇష్టమంటారు రామకృష్ణ.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment